Published 18 Dec 2023
ప్రపంచంలోనే అత్యంత వేగంగా నిర్మితమైన ప్రాజెక్టుగా భావిస్తున్న మేడిగడ్డపై న్యాయ విచారణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్లే కనపడుతున్నది. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత దీనిపై నిర్ణయం వెలువడే అవకాశాలున్నాయి. ఈ నెల 21న శాసనసభ సమావేశాలు ముగియనున్నాయి. నీటిపారుదల శాఖ(Irrigation Department)తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రివ్యూ నిర్వహించారు. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ లో భాగంగా నిర్మించిన మేడిగడ్డ(లక్ష్మీ) బ్యారేజీ కుంగిన ఘటనపై పూర్తి వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులకు CM స్పష్టం చేశారు. మేడిగడ్డతోపాటు గత ప్రభుత్వం నిర్మించిన ప్రాజెక్టులు, వాటి ప్రస్తుత తీరుపై పూర్తిస్థాయి వివరాలివ్వాలని ఆదేశించారు. ఈ సందర్భంగానే జ్యుడిషియల్ విచారణ గురించి రేవంత్ గుర్తు చేస్తూ దీనిపై నిర్ణయం తీసుకుంటామన్నట్లు తెలుస్తున్నది.
నిర్మాణ సంస్థ లేఖపై చర్చ
బ్యారేజీకి సంబంధించి పునరుద్ధణ పనులకు పాత ఒప్పందం కాకుండా కొత్త అగ్రిమెంట్ చేసుకోవాల్సి ఉంటుందని మేడిగడ్డ నిర్మాణ సంస్థ లెటర్ రాయడంపైనా సుదీర్ఘంగా చర్చించారు. ఈరోజు దీనిపై మరోసారి చర్చించాలని అధికారుల బృందానికి ముఖ్యమంత్రి తెలియజేశారు. గోదావరి బేసిన్ లో ఇబ్బందులు లేకున్నా కృష్ణా పరివాహక ప్రాంతంలోని ప్రాజెక్టుల వద్ద గందరగోళం నెలకొన్న వేళ.. యాసంగి పంటలకు నీరిచ్చే విషయంలోనూ చర్చ సాగింది. ప్రాజెక్టుల్లో వాటర్ కెపాసిటీ, సప్లయ్ తీరుపై ముందుగానే రైతులకు ఎందుకు అవగాహన కల్పించలేకపోయారని CM అడిగారు. సాగునీటిని విడుదల చేసే పరిస్థితులు లేవన్న విషయాన్ని ఎందుకు చెప్పలేదంటూ మండిపడ్డారు. యాసంగి పంటకు నీరు విడుదల చేయాల్సిన ప్రస్తుత సమయంలో కృష్ణా బేసిన్ లోని నాగార్జునసాగర్ ప్రాజెక్టులో తీవ్ర నీటి కొరత ఏర్పడి రెండు రాష్ట్రాల మధ్య జగడం జరిగింది.