రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన ‘ధరణి’ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే ‘ధరణి’ని ఎత్తివేస్తామని ప్రకటించినట్లుగానే అందులోని సమస్యలపై సమీక్ష నిర్వహించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, CM అడ్వయిజర్ వేం నరేందర్ రెడ్డి, ‘ధరణి’ కమిటీ సభ్యులు ఎం.కోదండరెడ్డి తదితరులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష(Review) చేపట్టారు. 2020లో అమలులోకి వచ్చిన ROR(Records Of Revenue)లోనే లోపాలున్నాయని, కేవలం 3 నెలల్లో చేపట్టిన భూ సమగ్ర సర్వే ద్వారా కొత్త చిక్కులు మొదలైనట్లు కమిటీ తెలిపింది.
15 రోజుల్లో ప్రారంభమే…
మార్చి మొదటి వారంలో అంటే మరో 15 రోజుల్లో సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమం మొదలుపెట్టాలని CM ఆదేశించారు. అన్ని తహసీల్దార్ కార్యాలయాల్లో వీటిని పరిష్కరించేందుకు గాను ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. కమిటీ సూచనల్ని పరిగణలోకి తీసుకుని, పెండింగ్ దరఖాస్తుల(Applications) పరిష్కారానికి అవసరమైన విధివిధానాలు(Guidelines) రూపొందించాలని రెవెన్యూ శాఖకు స్పష్టం చేశారు. ‘ధరణి’లో 2.45 లక్షల కేసులు పెండింగ్ లో ఉన్నాయని, వాటి పరిష్కారానికి ఏయే మార్గాలున్నాయో చూడాలని అన్నారు.
ఇంత దారుణమా…
టెక్నికల్, ఫైనాన్షియల్ బిడ్డింగ్ సహా ఇతర అర్హతల కారణంగా ILSF అనే కంపెనీకి BRS ప్రభుత్వం.. ‘ధరణి’ పోర్టల్ డిజైన్, డెవలప్మెంట్ ను అప్పగించిందని అధికారులు CMకు తెలిపారు. ఆ కంపెనీ దివాళా తీసినందున.. తర్వాత దాని పేరు టెర్రాసిస్ గా మార్చటం, డైరెక్టర్లు మారిపోవడం, చివరకు వాటాలు అమ్ముకుని ఫాల్కాన్ ఇన్వెస్ట్ మెంట్ కంపెనీగా అవతరించడంపై సుదీర్ఘ చర్చ జరిగింది. బిడ్ దక్కించుకున్న కంపెనీ ఇష్టమొచ్చినట్లు పేర్లు మార్చుకుంటే ప్రభుత్వం ఎలా ఒప్పుకుందని రేవంత్ ఆరా తీశారు. భూరికార్డుల డేటాను ఎవరికి పడితే వారికి, విదేశీ కంపెనీలకు కూడా అప్పగించే రూల్స్ ఉన్నాయా అని ప్రశ్నించారు.
10 రెట్లకు అమ్ముకోవడమా…
2018లో రూ.116 కోట్లకు టెండర్ దక్కించుకున్న కంపెనీ.. తమ వాటాల్ని దాదాపు రూ.1,200 కోట్లకు అమ్ముకోవడం దారుణమని CM అన్నారు. రికార్డులన్నీ వాళ్ల దగ్గరే ఉన్నందున విలువైన భూముల పేర్లు మార్చుకోలేదన్న గ్యారంటీ ఏముందని ప్రశ్నించారు. కొన్నిసార్లు అర్థరాత్రి పూట కూడా భూముల రిజిస్ట్రేషన్లు జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయని, ‘ధరణి’ పోర్టల్ పై నియంత్రణ లేదా అని రెవెన్యూ అధికారుల్ని సీఎం అడిగారు. పోర్టల్ నిర్వహిస్తున్న ఏజన్సీపై విచారణ చేపట్టాలని ఆదేశించారు.