ఫ్లైట్(Flight) దిగిన వృద్ధ ప్రయాణికుడికి చక్రాల కుర్చీ ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో… సదరు వ్యక్తి నడుచుకుంటూ వెళ్లి ఎయిర్ పోర్ట్ లాంజ్ లోనే ప్రాణాలు కోల్పోయిన ఘటనపై DGCA(Director General Of Civil Aviation) కఠిన చర్యలు తీసుకుంది. ఎయిరిండియాకు రూ.30 లక్షల జరిమానా(Fine) విధించింది. వయసు మీరిన ప్రయాణికుల పట్ల జాగ్రత్తలు(Caring) తీసుకోవాల్సిన విమానయాన సంస్థ.. నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ముంబయి ఎయిర్ పోర్టులోని ఇమ్మిగ్రేషన్ కౌంటర్ వద్ద ఆ వృద్ధుడు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు.
జరిగిన ఘటన ఇది…
ఈ నెల(2024 ఫిబ్రవరి) 11న ప్రయాణించేందుకు వృద్ధ దంపతులు న్యూయార్క్ నుంచి ముంబయికి ముందుగానే ఎయిరిండియా విమానంలో వీల్ ఛైర్ టికెట్ బుక్ చేసుకున్నారు. USలో నివసిస్తున్న భారత సంతతికి చెందిన ఈ గుజరాత్ జంట.. ఎయిరిండియా ఫ్లైట్ AI-116లో ఎకానమీ క్లాస్ కింద టికెట్ తీసుకున్నారు. ఈనెల 11న మధ్యాహ్నం న్యూయార్క్ లో బయల్దేరిన విమానం 12న మధ్యాహ్నం 2:10 గంటలకు ముంబయి ఎయిర్ పోర్టులో దిగింది.
వీల్ ఛైర్ లేక..
విమానం దిగిన వెంటనే సదరు వృద్ధుడికి వీల్ ఛైర్ కేటాయించాల్సి ఉండగా.. ఎయిరిండియా పట్టించుకోలేదు. దీంతో ఎందుకులే టైం వేస్ట్ అని ఆ దంపతులు నడుచుకుంటూ ఇమ్మిగ్రేషన్ కౌంటర్ దాకా వెళ్లారు. కానీ అక్కడే ఆ పెద్దమనిషి కుప్పకూలి ప్రాణాలు కోల్పోయారు. దీనిపై DGCA తీవ్రంగా మండిపడుతూ ఎయిరిండియాకు నోటీసులు పంపింది.
ఆ సమయంలో వీల్ ఛైర్ కు ఫుల్ డిమాండ్ ఉందని.. 32 మందికి వీల్ ఛైర్ లు అరేంజ్ చేయాల్సి ఉండగా, కేవలం 15 మాత్రమే ఉన్నాయని చెప్పింది. వారందర్నీ లాంజ్ లోకి పంపిన తర్వాత వచ్చే వీల్ ఛైర్ లో సదరు వృద్ధుణ్ని తీసుకెళ్తామని చెప్పినట్లు, కానీ అప్పటివరకు అతను ఆగలేదంటూ ఎయిరిండియా జవాబిచ్చింది. ఇది పెద్ద తప్పిదమని భావించిన DGCA.. ఎయిరిండియాకు భారీస్థాయిలో రూ.30 లక్షల ఫైన్ విధించింది.