రాష్ట్రంలో కీలక పొత్తుగా రెండు పార్టీలు భారత్ రాష్ట్ర సమితి(BRS), బహుజన్ సమాజ్ పార్టీ(BSP) భావించిన వ్యవహారం.. చివరకు బెడిసికొట్టినట్లయింది. రెండు పార్టీల మధ్య సీట్ల పంపకాలు జరిగి అభ్యర్థుల ఎంపిక పూర్తయిన దశలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. BSP రాష్ట్ర అధినేతగా వ్యవహరిస్తున్న ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్… పార్టీని వీడుతున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
అయితే ఆయన BSPని ఎందుకు వీడుతున్నారన్న విషయం బయటకు రాలేదు. ‘పరిస్థితులకు అనుగుణంగా కొత్తదారిలో నడుస్తా.. బరువైన గుండెతో రాజీనామా చేస్తున్నా.. నన్ను నమ్ముకున్న స్వేరో కార్యకర్తల్ని మోసం చేయను.. నాకు రాజీనామా తప్ప మరో మార్గం కనిపించలేదు..’ అంటూ తెలియజేశారు.
పొత్తులో భాగంగా BSPకి రెండు సీట్లు కేటాయించిన BRS… ఆ స్థానాలేంటో కూడా స్పష్టం చేసింది. నాగర్ కర్నూల్, హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గాల నుంచి BSP అభ్యర్థులు బరిలో ఉంటారని ప్రకటించింది. దీంతో నాగర్ కర్నూల్ లో స్వయంగా తానే రంగంలోకి దిగుతానని ప్రవీణ్ కుమార్ ప్రకటించారు. ఇక అసలు పోరే తరువాయి అన్న దశలో… ఎన్నికల ప్రకటనకు గంట ముందుగానే తాను BSPని వీడుతున్నట్లు ప్రవీణ్ కుమార్ స్పష్టం చేయడంతో ఏం జరిగిందన్న చర్చ జోరుగా సాగుతున్నది.