కాంగ్రెస్ పార్టీ(AICC)లో ఇంతకుముందు ఒక పవర్ సెంటర్(Power Centre) మాత్రమే ఉండేదని, కానీ ఇప్పుడది ఐదుకు చేరుకుందని ఆ పార్టీ మాజీ MP, మహారాష్ట్రకు చెందిన సీనియర్ లీడర్ సంజయ్ నిరుపమ్ అన్నారు. హస్తం పార్టీ మునిగిపోయే నౌక లాంటిదని విమర్శలు చేశారు. పార్టీపై విమర్శలు(Criticises) చేసినందుకు ఆయన్ను నిన్న బహిష్కరిస్తూ(Expelled) అధిష్ఠానం నిర్ణయం తీసుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపమ్ పార్టీపై విమర్శలు చేస్తూనే మోదీ పాపులారిటీ ఎంతగా పెరుగుతుందో కాంగ్రెస్ ప్రతిష్ఠ అంతకంతకూ దిగజారుతున్నదన్నారు.
పవర్ సెంటర్లివేనంటూ…
కొన్నేళ్ల క్రితం వరకు సోనియాగాంధీ ఒక్కరే పవర్ సెంటర్ గా ఉండేవారని, కానీ ఇప్పుడా సంఖ్య ఐదుగురికి పాకిందని సంజయ్ నిరుపమ్ విమర్శించారు. రెండోది రాహుల్ గాంధీ, మూడో పవర్ సెంటర్ గా ప్రియాంక వాద్రా, నాలుగోది AICC ప్రెసిడెంట్ అయిన మల్లికార్జునఖర్గే, ఇక చివరిది పార్టీ ప్రధాన కార్యదర్శి(General Secretary) కె.సి.వేణుగోపాల్ అంటూ బాంబు పేల్చారు. ఈ ఐదుగురూ ఎవరికి వారే రాజకీయాలు చేస్తూ లాబీయింగ్ కు కేంద్రాలుగా మారారని, తనతోసహా దేశవ్యాప్తంగా గల లక్షలాది మంది అందులో చిక్కుకుని విలవిల్లాడుతున్నారని మండిపడ్డారు. నిరుపమ్ ఇంతకుముందు రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు.