తెలంగాణ రాష్ట్ర సమితిని భారత్ రాష్ట్ర సమితిగా మార్చిన పార్టీ నాయకత్వం(High Command) ఇప్పుడు తిరిగి పాత పేరునే తీసుకురాబోతున్నదా… BRS స్థానంలో తిరిగి TRSనే అమల్లోకి తేవాలని భావిస్తుందా… ఈ మాటలకు బలం చేకూర్చారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. జనగామ జిల్లా పాలకుర్తిలో పార్టీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఎర్రెబెల్లి… జైలుకు వెళ్లినా సరే పార్టీ మారేది లేదన్నారు.
కలిసిరాక…
BRSగా మారిన తర్వాత ఆ పార్టీకి ఏదీ పెద్దగా కలిసిరాలేదు. పూజలు, వాస్తును విపరీతంగా విశ్వసించే KCR సైతం.. తెలంగాణ భవన్ లో మార్పులు చేస్తున్నారు. ఇపుడున్న పాత గేట్ కాకుండా కొత్త దారిని నిర్మించారు. ఇక BRS అని పేరు పెట్టిన కొన్ని నెలలకే అధికారం కోల్పోవడంతోపాటు అధినేత సైతం కాలు జారి సర్జరీ చేయించుకోవాల్సి వచ్చింది.
ఇలాంటి పరిస్థితుల్లో BRS కంటే TRS అనేదే బాగుండేదని చాలా మంది సీనియర్లలో అభిప్రాయం ఏర్పడ్డట్లే కనపడుతున్నది. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకునే ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ కామెంట్స్ చేసి ఉంటారన్న మాటలు వినపడుతున్నాయి.