కోడి తన పిల్లల్ని ఎట్ల కాపాడుతదో తాను కూడా అలాగే రాష్ట్రాన్ని కాపాడినట్లు మాజీ ముఖ్యమంత్రి(Former CM) కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అన్నారు. కేంద్ర సంస్థలను ప్రతిపక్షాలపై ఉసిగొల్పడమే మోదీ సర్కారు టార్గెట్ అని విమర్శించారు. లోక్ సభ ఎన్నికల సందర్భంగా చేవెళ్లలో నిర్వహించిన సభలో కేసీఆర్ ప్రసంగించారు. భావోద్వేగాలు, మత పిచ్చి లేపడం.. మోదీ, ED తప్ప BJPకి ఇంకోటి ఉందా అని కేసీఆర్ మండిపడ్డారు.
రైతుబంధు కింద ఎకరానికి రూ.10 వేలు ఇచ్చామని, గుంట భూమి ఉన్న రైతు మృతిచెందినా రైతు బీమా ఇచ్చామని గుర్తు చేశారు. BRS పుట్టిందే తెలంగాణ కోసమని, ప్రజలకు మంచి చేసేందుకు బతికున్నంత కాలం పనిచేస్తామని KCR అన్నారు. ఇంటికి తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ మాట ఏమైందని ప్రశ్నించారు. అన్ని పంటలు కొని వాటికి బోనస్ ఇస్తామన్నారు.. మరి ఆ బోనస్ ఇస్తరా లేదా అంటూ విమర్శలు చేశారు.