సార్వత్రిక ఎన్నికల(General Elections) కోసం రాష్ట్రంలో నోటిఫికేషన్ ఇచ్చిన రోజే పలువురు ముఖ్య నేతలు నామినేషన్లు వేశారు. ఈరోజే మంచి ముహూర్తం ఉండటం కూడా లీడర్లకు సెంటిమెంట్ గా మారింది. ఇందులో భారతీయ జనతా పార్టీ నుంచే నామినేషన్లు వేసినవారు ఉన్నారు. మల్కాజిగిరి నుంచి ఈటల రాజేందర్, మహబూబ్ నగర్ నుంచి డి.కె.అరుణ నామినేషన్లు వేశారు. లోక్ సభ ఎన్నికలతోపాటు BRS MLA లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది.
భారీ ర్యాలీగా…
శామీర్ పేట నుంచి పార్టీ కార్యకర్తల భారీ ర్యాలీతో వెళ్లి ఈటల రాజేందర్ మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్లో నామినేషన్ అందజేశారు. కేంద్ర మంత్రులు హర్దీప్ సింగ్ పురీ, కిషన్ రెడ్డి వెంటరాగా తన సతీమణితో కలిసి వెళ్లి రెండు సెట్లు దాఖలు చేశారు. అటు రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ వెంట రాగా BJP సీనియర్ లీడర్ డీకే అరుణ.. మహబూబ్ నగర్ కలెక్టరేట్లో నామినేషన్ వేశారు. కాటన్ మిల్లులోని శ్రీవేంకటేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించిన అరుణ.. అక్కణ్నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కు చేరుకున్నారు.
అటు మెదక్ MP స్థానానికి దుబ్బాక మాజీ MLA రఘునందన్ రావు నామినేషన్లు వేశారు. మెదక్ స్థానానికి కాంగ్రెస్ నుంచి నీలం మధు తరఫున MLA మైనంపల్లి రోహిత్ రావు.. నల్గొండలో BJP నుంచి శానంపూడి సైదిరెడ్డి.. కరీంనగర్లో ఇండిపెండెంట్ అభ్యర్థితోపాటు భువనగిరిలో స్వతంత్ర అభ్యర్థి లింగిడి వెంకటేశ్వర్లు నామినేషన్ అందజేశారు.