అధికారంలో ఉన్న హస్తం పార్టీలోకి వలస(Migrations)లు కొనసాగుతూనే ఉన్నాయి. శాసనసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ముగ్గురు MLAల జంపింగ్ తో ఇబ్బందుల్లో పడ్డ భారత్ రాష్ట్ర సమితి ఇప్పుడు మరో MLAను వదులుకోవాల్సి వస్తున్నది. రాజేంద్రనగర్ MLA ప్రకాశ్ గౌడ్ పార్టీ మారబోతున్నారు. ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రిని కలిశారు.
త్వరలోనే హస్తం పార్టీ కండువా కప్పుకుంటానని ప్రకాశ్ గౌడ్ హింట్ ఇచ్చారు. గత కొద్దిరోజుల క్రితం BRSకు చెందిన ముగ్గురు MLAలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు పార్టీని విడిచిపెట్టారు. దానం ఖైరతాబాద్ నుంచి, కడియం స్టేషన్ ఘన్ పూర్ నుంచి, తెల్లం వెంకట్రావు భద్రాచలంలో మొన్నటి ఎన్నికల్లో గెలుపొందారు.
ఇప్పుడు వారి సరసన రాజేంద్రనగర్ MLA సైతం చేరబోతున్నారు. ఫిరాయింపుల్ని అడ్డుకునేందుకు రెగ్యులర్ గా మీటింగ్స్ పెట్టుకుంటున్నా BRSకు లాభం ఉండటం లేదు. మొన్నటి ఎన్నికల్లో 39 స్థానాలకు పరిమితమైన గులాబీ పార్టీ.. ఇప్పుడు నలుగురిని కోల్పోవడంతో ఆ సంఖ్య 35కు పడిపోయింది. పార్టీ మారిన సభ్యులపై అనర్హత వేటు వేయాలంటూ BRS.. హైకోర్టును ఆశ్రయించింది.