వన్ నేషన్-వన్ ఎలక్షన్ తరహాలో దేశమంతా ఒకే సమయాన్ని పాటించేలా కేంద్ర ప్రభుత్వం.. వన్ నేషన్-వన్ టైమ్ ప్రాజెక్టును చేపట్టింది. ఇండియన్ స్టాండర్డ్ టైమ్(Indian Standard Time)పై కచ్చితత్వం సాధించేందుకు ఈ ప్రాజెక్టు ఉపయోగపడుతుంది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ISRO)తో కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ, నేషనల్ ఫిజికల్ లాబొరేటరీ(NPL) సంయుక్తంగా పరిశోధన చేస్తాయి. మిల్లీ సెకను నుంచి మైక్రోసెకను దాకా కచ్చితత్వ ISTని నిర్ధారించేందుకు దేశమంతటా ఐదు లీగల్ మెట్రాలజీ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తారు. నావిగేషన్, టెలికమ్యూనికేషన్, డిజిటల్ గవర్నెన్స్ వంటి అత్యాధునికి శాస్త్రీయ పరిశోధనలకు ఈ ప్రాజెక్టు అవసరం. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఒకే సమయాన్ని ఉపయోగించడం ద్వారా పరిపాలన తీరులో మార్పు ఉంటుంది. దీని ముసాయిదా నిబంధనలపై ఫిబ్రవరి 14లోగా ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనల్ని మంత్రిత్వ శాఖ కోరుతోంది.
ఎందుకంటే…
భారత పశ్చిమం కంటే తూర్పున సూర్యుడు రెండు గంటలు ముందుగా ఉదయిస్తాడు. అందువల్ల ఈశాన్య ప్రాంతాల కంటే ముందుగా మిగతా ప్రాంతాల్లో పనిగంటలు మొదలై త్వరగా ముగుస్తాయి. ఇప్పటివరకు ఒకే IST టైం జోన్ ప్రకారం సమయాన్ని లెక్కగట్టడం ద్వారా ఆయా ప్రాంతాల్లో వెలుతురు లేక ఇంధన ఖర్చులు ఎక్కువగా ఉంటున్నాయి. దీనివల్ల ఈశాన్య ప్రాంతాలకు, మిగతా ప్రాంతాల మధ్య గంట తేడా ఉంటున్నది. ప్రస్తుతం లెక్కిస్తున్న రేఖాంశంతోపాటు మరో రేఖాంశంతోనూ అన్ని ఈశాన్య రాష్ట్రాలు, అండమాన్, నికోబార్ దీవులు ఉండేలా రీసెర్చ్ జరుగుతుంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఒకే టైం ఆధారంగా అన్ని రంగాల్లో IST వినియోగాన్ని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిబంధనలు రూపొందించింది. వాణిజ్యం, ఆర్థిక కార్యకలాపాలు, రవాణా, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ వంటివన్నీ ISTకి లోబడి ఉంటాయి. IST కాకుండా ఇతర టైమ్ జోన్లను ప్రస్తావించడం నిషేధం. ఖగోళ శాస్త్రం, నావిగేషన్, శాస్త్రీయ పరిశోధనలకు ప్రత్యేక అనుమతితో మినహాయింపులుంటాయి.