ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర సంఘటన ఎదురైంది. BJP అభ్యర్థి అయిన యువకుడికి సభా వేదికపైనే ప్రధాని మోదీ పాదాభివందనం చేయడం ఆశ్చర్యకరంగా నిలిచింది. దేశ రాజధానిలోని కర్తార్ నగర్(Kartar Nagar)లో ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. పత్పార్ గంజ్ స్థానం నుంచి పోటీ చేస్తున్న రవీందర్ సింగ్ నేగి.. తొలుత ప్రధాని కాళ్లకు నమస్కరించారు. దీన్ని అడ్డుకున్న మోదీ ప్రతిగా(Reciprocate) ఆ యువకుడి పాదాలకే నమస్కారం చేశారు. ఇలా మూడు సార్లు వంగి నమస్కారం చేయడంతో అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత నిమిషానికే.. విశ్వాస్ నగర్ స్థానం నుంచి బరిలోకి దిగిన ఓం ప్రకాశ్ శర్మ సైతం మోదీకి పాదాభివందనం చేయబోయారు. ఈ సందర్భంలోనూ ప్రధాని తిరస్కరించడంతో.. మోదీ వినమ్రతపై చర్చ జరిగింది.
మోదీ నమస్కరించిన రవీందర్ సింగ్.. తూర్పు ఢిల్లీలోని వినోద్ నగర్ ప్రాంత కౌన్సిలర్ గా ఉన్నారు. దుకాణాల బోర్డులపై యజమానుల పేర్లు, కులం ముద్రించి ఉండాలని గతేడాది రవీందర్ సింగ్ అన్న మాటలు వైరల్ గా మారాయి. దీనిపై విమర్శలు రావడంతో BJP హైకమాండ్ వెంటనే స్పందించింది. నవరాత్రుల సందర్భంగా పాల ఉత్పత్తులు కొనే హిందువుల సెంటిమెంట్ ను గౌరవించేందుకే పేర్లు ముద్రించాలంటూ రవీందర్ గుర్తుచేశారని తెలిపింది.