
పోలీసు ఉద్యోగార్థుల వయోపరిమితిపై తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. యూనిఫామ్ సర్వీసు పోస్టుల డైరెక్ట్ రిక్రూట్మెంట్ గరిష్ఠ వయోపరిమితిని రెండేళ్లపాటు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. పోలీస్, ఫైర్, జైళ్లు, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్, ఎక్సైజ్, రవాణా, అటవీ శాఖల్లోని పోస్టులకు ఇది వర్తిస్తుందని తెలిపింది. ఇప్పటికే 2026 మే 18న జారీచేసిన ఉత్తర్వుల ద్వారా ఐదేళ్ల వయోపరిమితిని పెంచగా, ఇప్పుడు దానికి మరో రెండేళ్లు కలవడంతో మొత్తం గరిష్ఠ వయోపరిమితి ఏడేళ్లకు చేరింది.
ఇది ప్రస్తుత పోలీస్ రిక్రూట్మెంట్లకే వర్తించనుందని, నిరుద్యోగ యువత నుంచి వచ్చిన విజ్ఞప్తుల్ని పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ సరికొత్త వెసులుబాటు ద్వారా మరింత మంది నిరుద్యోగులు ఉద్యోగాలకు పోటీ పడే అవకాశం లభిస్తుందని భావించింది.