
జెన్ జీలు పుట్టుకతోనే స్మార్ట్ ఫోన్లు, డిజిటల్ టెక్నాలజీ చూస్తూ పెరిగిన మొట్టమొదటి తరం. అయితే వీరంతా చాలా జాగ్రత్తగా డబ్బు ఖర్చు చేస్తున్నారు. విహారయాత్రల కంటే రోజువారీ అవసరాలకే ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారని శాలరీసే(SalarySe) అధ్యయనం వెల్లడించింది. దేశవ్యాప్తంగా 5.2 లక్షల మంది యూపీఐ లావాదేవీల్ని విశ్లేషించింది.
బిల్లులు, సబ్ స్క్రిప్షన్లకు 20.1% చెల్లింపులు జరుపుతుండగా, అన్ని ఖర్చుల్లో ఇదే అత్యధికం. ఇక కిరాణాల్లో రోజువారీ సరకులకు 15.7%, బ్యాంకింగ్ చెల్లింపులకు 12.2%, షాపింగ్ 11.9%, ఫుడ్ పై 11.5% చొప్పున మొత్తంగా ఈ ఐదింటికే 70 శాతానికి పైగా డబ్బును ఖర్చు పెడుతున్నారు. విహారయాత్రల ఖర్చు కేవలం 5 శాతంగానే ఉండటం జెన్ జీల పరిణతికి అద్దం పడుతుందని తేలింది.