
ఈరోజు ఎన్నికలు వచ్చినా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే(NDA)కు 326 సీట్లు వస్తాయని ‘సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్(MOTN)’ సర్వే ప్రకటించింది. అధికారాన్ని నిలబెట్టుకునేందుకు మంచి స్థితిలోనే ఉన్నా ప్రజాదరణ తగ్గుతున్న సంకేతాలు కనిపించాయి. జనవరిలో అంచనా(352 సీట్లు) వేసిన దానికన్నా ఇప్పుడు 26 సీట్లు తగ్గిపోయాయి. జెన్ జీతో సవాలున్నా ఓటర్ల విశ్వాసం చెక్కుచెదరలేదు. కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండీ కూటమికి 185 సీట్లు వస్తాయని తెలిపింది. జనవరిలో నిర్వహించిన సర్వే కంటే కాంగ్రెస్ అలయెన్స్ కు 3 సీట్లు పెరిగాయి.
2024 ఎన్నికల్లో సాధించిన 234 స్థానాలతో పోలిస్తే, ప్రస్తుతానికి ఇండీ కూటమి 49 సీట్లు కోల్పోయినట్లే. జులై 1 – ఆగస్టు 25 మధ్య దేశవ్యాప్తంగా 25,184 మందిని నేరుగా సర్వే చేయగా, గత ఆరు నెలల్లో 91,795 మందిని పరిగణలోకి తీసుకున్నట్లు సీఓటర్ తెలిపింది. ప్రధానమంత్రి అభ్యర్థిత్వంపై మోదీకి 49%, రాహుల్ గాంధీకి 27%, తమిళనాడు సీఎం విజయ్ కి 9% మంది ఓటేశారు. పార్లమెంటులో టీవీకేకు ఒక్క ఎంపీ లేకపోయినా ప్రధాని అభ్యర్థిగా ఆయనకు మంచి ఇమేజ్ దక్కింది.