
ఆదాయానికి మించి ఆస్తుల కేసులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా గనులు, భూగర్భవనరుల శాఖ ఏడీ బొజ్జా జయరాజు ఇళ్లపై ఏసీబీ జరిపిన దాడుల్లో కోట్లాది ఆస్తులు బయటపడ్డాయి. హైదరాబాద్ బోడుప్పల్లో జీ+2 బిల్డింగ్, కె.పి.హెచ్.బి. కాలనీలో ఫ్లాట్.. కీసర, తుంగతుర్తి, తూప్రాన్, సూర్యాపేటలో 5 ప్లాట్లు, 3.21 ఎకరాల భూమి.. రూ.10 లక్షల నగదు, 4 ఫోర్ వీలర్లు, 629 గ్రాముల బంగారు నగలు, 3 అకౌంట్లలో రూ.71.24 లక్షలు.. మొత్తంగా కోట్లాది ఆస్తులు వెలుగులోకి వచ్చాయి. వీటి విలువ బహిరంగ మార్కెట్లో రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేశారు.
ఇసుక రవాణా మామూళ్లకు సంబంధించి తన ఖాతాకు పలు దఫాలుగా రూ.24 లక్షలు జమ చేసినట్లు జయరాజు డ్రైవర్ ఒప్పుకున్నాడు. మామూళ్ల ద్వారా సంపాదించిన డబ్బును తన కూతురి అకౌంట్లకు పంపించినట్లు అధికారులు గుర్తించారు. ఈమధ్యే ఆయన ఉత్తమ అధికారిగా అవార్డు అందుకోగా.. ఇలా అక్రమంగా సంపాదించడమే ఉత్తమ విధులు నిర్వహించినట్లా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.