
ఒంటరితనమే పురుషులకు మద్యం తాగే అలవాటు పెంచుతుందని అమెరికా నార్త్ వెస్టర్న్ వర్సిటీ పరిశోధకులు గుర్తించారు. మెదడులోని ఒక నాడీ మార్గం అతిగా స్పందించడం వల్లే మద్యానికి బానిసలవుతున్నారట. ఎలుకలపై అధ్యయనం కోసం రెండు వారాల పాటు వాటికి రోజూ గంటపాటు మంచినీరు, 15% అల్కహాల్ గల కూల్ డ్రింక్ ఇచ్చి అవి ఎంత మోతాదుతో తీసుకుంటున్నాయో పరిశీలించారు. ఒంటరి మగ ఎలుకలు మద్యాన్ని పెంచితే ఆడ ఎలుకలు తగ్గించాయి. జంతువులు స్వేచ్ఛగా తిరుగుతూ మద్యం తాగాలా, వద్దా అని ఆలోచిస్తున్నప్పుడు సూక్ష్మ మైక్రోస్కోపుల ద్వారా వాటి మెదడులోని నిర్దిష్ట కణాల కార్యకలాపాలను సైంటిస్టులు నమోదు చేశారు.
భావోద్వేగ/ఒత్తిడి సంకేతాలను ప్రాసెస్ చేసే బేసోలేటరల్ అమిగ్దాలాను, నిర్ణయాలను నియంత్రించే మీడియల్ ప్రీఫ్రంటల్ కార్టెక్స్ కు అనుసంధానించే ఒక మెదడు సర్క్యూట్ ను ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. ఒంటరిగా ఉన్నప్పుడు ఒక నిర్దిష్ట మార్గం అతి చురుకుగా మారి నేరుగా మద్యం తాగడాన్ని పెంచుతుందని.. అలాగే స్త్రీ, పురుషులు ఒంటరిగా ఉన్నప్పుడు వేర్వేరు నాడీ వ్యూహాలపై ఆధారపడతారని అధ్యయనంలో తేల్చారు.