
సీఎన్జీ(కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) ధరలు మరోసారి పెరిగాయి. కిలో ఇంధనానికి రూ.3.89 చొప్పున పెంచుతూ ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్(ఐజీఎల్) నిర్ణయం తీసుకుంది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో దీని ధర రూ.86.98కి చేరగా, ఆయా రాష్ట్రాల్ని బట్టి ధరలు ఉంటాయి. ఈ తాజా నిర్ణయం ఈరోజు ఉదయం 6 గంటల నుంచి అమలవుతుందని సదరు సంస్థ ప్రకటించింది. మీథేన్ వాయువుతో కూడిన పర్యావరణహిత ఇంధనమైన సీఎన్జీని కార్లు, ఆటోల్లో వాడతారు. దీని వల్ల హానికారక ఉద్గారాలు 80% వరకు తగ్గుతాయి.
అంతర్జాతీయంగా లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్(ఎల్ఎన్ఎన్జీ) ధరలు పెరిగినందునే దేశంలో సీఎన్జీ రేట్లు పెంచక తప్పడం లేదని ఐజీఎల్ తెలిపింది. హార్ముజ్ నుంచి రవాణాకు ఇంకా ఇబ్బందులు ఉండటం.. యూరోపియన్ దేశాల్లో శీతాకాల ప్రభావంతో గ్యాస్ కు విపరీతమైన డిమాండ్ పెరిగి అంతర్జాతీయ స్థాయిలో రేట్లు ఎగబాకుతున్నాయి. ఈ మే నెలలో నాలుగు సార్లు కలిపి మొత్తంగా రూ.6 పెంచితే, ఇప్పుడు మరోసారి వడ్డన తప్పలేదు.