
బంగారం(Gold) ధరలు మరోసారి మిస్టరీగా మారాయి. ఇలా ఎందుకు జరుగుతుందా అని పసిడిప్రియులు తలలు పట్టుకుంటున్నారు. ద్రవ్యోల్బణం, యుద్ధాల భయంతో ఇన్వెస్టర్లు తొలుత పెట్టుబడుల కోసం సురక్షితమైన వస్తువుగా బంగారంపై పడ్డారు. కానీ అంతలోనే పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఆగస్టులో మేలిమి పసిడి 10 గ్రాములకు గరిష్ఠంగా రూ.1,67,000 దాటింది. కానీ 15 రోజుల్లోనే తారుమారైంది. అందుకు 3 కారణాలున్నాయి. బలపడుతున్న అమెరికన్ డాలర్(Dollar), యూఎస్ ఫెడ్ వడ్డీరేట్ల పెంపు సంకేతాలు, క్రూడాయిల్ ధరల పెంపు బంగారాన్ని పతనం చేస్తున్నాయి.
*వడ్డీ రేట్లు పెరిగితే ఎలాంటి వడ్డీ ఆదాయమివ్వని పసిడిపై ఆసక్తి తగ్గుతుంది. సాధారణంగా వడ్డీ రేట్లు పెరిగితే బాండ్లు, ఇతర డిపాజిట్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతారు. బంగారంపై ఎలాంటి వడ్డీ రాదు కాబట్టి పెట్టుబడులు తగ్గించి అమ్మకాలు పెంచుతున్నారు.
*డాలర్ బలపడితే ఇతర కరెన్సీల దేశాలకు పసిడి ఖరీదై డిమాండ్ తగ్గి ధరలు పడిపోతాయి. అంతర్జాతీయ మార్కెట్లో యూఎస్ డాలర్ విలువ 3 నెలల గరిష్ఠస్థాయికి చేరుకుంది. అమెరికా ప్రభుత్వ బ్రాండ్ యీల్డ్స్(Bond Yeilds) కూడా భారీగా పెరిగాయి. ధరలు గరిష్ఠ స్థాయికి చేరడంతో పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు, ఇన్ స్టిట్యూషనల్ ఫండ్ మేనేజర్లు తమ లాభాలను వెనక్కు తీసుకోవడానికి పసిడిని భారీగా విక్రయించడానికి ముందుకు వస్తున్నారు.
*చమురు ధరలు పెరిగితే ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దాన్ని అణచడానికి వడ్డీ రేట్లను పెంచాల్సి రావడం పసిడికి ప్రతికూలమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదం ఉండటంతో కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గించలేకపోతున్నాయి. గతంలో రష్యా-ఉక్రెయిన్, మిడిల్ ఈస్ట్ సంక్షోభాల సమయంలో కేంద్ర బ్యాంకులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని భారీగా కొనుగోలు చేశాయి. ప్రస్తుతం ఆ కొనుగోళ్ల వేగం తగ్గడంతో ధరల పతనం కొనసాగుతూనే ఉంది.