ఆమె యువ ఎమ్మెల్యే(MLA). మొన్ననే రోడ్డు యాక్సిడెంట్ లో అనూహ్యంగా భారీ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తమ పార్టీ ఏర్పాటు చేసిన సభకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో స్పీడ్ గా వచ్చిన ఆటో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె చిన్న గాయాలతో బయటపడ్డారు. ఇది మొన్నటి నల్గొండలో BRS నిర్వహించిన సభ నుంచి తిరిగివెళ్తున్న టైమ్ లో నార్కట్ పల్లి వద్ద జరిగిన ఇన్సిడెంట్. కానీ ఇది జరిగిన కొద్దిరోజులకే ఇవాళ మరో యాక్సిడెంట్ నుంచి మాత్రం MLA లాస్య నందిత తప్పించుకోలేకపోయారు.
కార్పొరేటర్ నుంచి MLA స్థాయికి…
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో BRS పార్టీ తరఫున సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి లాస్య నందిత పోటీ చేసి గెలిచారు. ఆమె తండ్రి జి.సాయన్న MLAగా పనిచేయగా.. 2023 ఫిబ్రవరి 19న ఆయన మృతిచెందారు. దీంతో సాయన్న స్థానంలో ఆయన కూతురు నందితకు టికెట్ ను పార్టీ కట్టబెట్టి గెలిపించుకుంది. బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన నందితకు తల్లి గీతతోపాటు ఇద్దరు సోదరీమణులు నమ్రత, నివేదిత ఉన్నారు.