ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే కనపడుతున్నది. ఇప్పటివరకు విచారణల నుంచి తప్పించుకుంటున్న ఆయన్ను ఎట్టకేలకు ED పట్టుకుంది. ఆప్ అధినేతను విచారించేందుకు గాను ED(Enforcement Directorate) అధికారులు ఆయన నివాసానికి వెళ్లారు. 12 మందితో కూడిన అధికారుల బృందం కేజ్రీవాల్ ఇంటికి చేరుకుంది. ఇప్పటికే తొమ్మిదిసార్లు ED నోటీసులు అందుకున్న కేజ్రీవాల్.. ఒక్కసారి కూడా విచారణకు హాజరు కాలేదు.
ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో…
మనీ లాండరింగ్ కేసులో ED తనను అరెస్టు చేయకుండా ఆదేశాలిచ్చి తనకు రక్షణ కల్పించాలంటూ అంతకుముందు కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అరెస్టు చేయకుండా ఆదేశాలు ఇవ్వలేమంటూ జస్టిస్ సురేశ్ కుమార్ కైత్ నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పడంతో విచారణకు మార్గం సుగమమైంది. అయితే ఈ పిటిషన్ ను విచారించేందుకు ఏప్రిల్ 22న గడువిచ్చింది.
ఈ నెల 16న…
కేజ్రీవాల్ కు ఈ నెల 16న రౌస్ అవెన్యూ కోర్టు నుంచి బెయిల్ లభించింది. రౌస్ అవెన్యూ కోర్టులోని CBI కోర్టే ఢిల్లీ లిక్కర్ స్కామ్ ను విచారిస్తున్నది. ఇప్పటికే ఈ కేసులో BRS ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఈనెల 16న కోర్టు ఎదుట ప్రవేశపెట్టిన రోజే కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. మనీలాండరింగ్ వ్యవహారంపై ఇప్పటికే 9 సార్లు తప్పించుకున్న కేజ్రీవాల్.. ఈసారి మాత్రం దాన్నుంచి బయటపడలేకపోయారు. ED అధికారులు సెర్చ్ వారెంట్ తో ఆయన ఇంట్లోకి ప్రవేశించారు. దీంతో ఆమ్ ఆద్మీ నాయకులు, కార్యకర్తలు భారీయెత్తున చేరుకోవడంతో అంతకుముందే పెద్దసంఖ్యలో బలగాల్ని మోహరించారు.