
పండ్లు, కూరగాయలు దేశంలోనే అత్యధికంగా తెలంగాణలో విషపూరితంగా ఉన్నట్లు తేలింది. 2023 నుంచి 2026 వరకు రాష్ట్రంలో తీసుకున్న 8,198 నమూనాల్లో 486(5.9%) విషపూరితంగా తేలాయని కేంద్ర ప్రభుత్వం లోక్ సభలో తెలిపింది. పురుగు మందుల వాడకంలో తెలంగాణ టాప్ లో, 3.6%తో కర్ణాటక రెండో స్థానంతో ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాలు జాతీయ సగటు(3.1%) కంటే ఎక్కువతో ఉండటం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోంది. ఒడిశా, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాల్లో 1,362 నమూనాలు సేకరిస్తే అందులో ఒక్క ఉల్లంఘన బయటపడకపోగా, అక్కడి పురుగుమందుల అవశేషాలు 0%తో ఉన్నాయి.
2022-23 జాతీయ సగటు అయిన హెక్టారుకు 0.277 కిలోలతో పోలిస్తే తెలంగాణలో 2024లో 0.530 కిలోల పెస్టిసైడ్స్ వాడినట్లు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో క్లోరోపైరిఫాస్(పురుగులను చంపే మందు), 2, 4-డి(కలుపు మొక్కలను చంపే పురుగు మందు) ఉన్నాయని నిపుణులు హెచ్చరించారు. దీంతో పండ్లు, కూరగాయలు కొనాలంటే ఇక భయపడాల్సిందే మరి.