
“ఉద్యోగాల్లేని యువత దృష్టి మరల్చి కొద్దికాలం పాటే నెగ్గుకురావచ్చు.. కానీ త్వరగానే వీధుల్లోకి వస్తారు..” అని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ హెచ్చరించారు. ఖాళీగా ఉన్న యువతే దేశానికి ప్రమాదకరమని మిగతా ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. 15-29 ఏళ్ల యువతలో పావు మందిని ‘నీట్(ఉపాధి, విద్య, శిక్షణలో లేని)’ అని పిలుస్తారు. నిరుద్యోగం 9.9% ఉండగా, ఇది మొత్తం జనాభా నిరుద్యోగ రేట్ కంటే 3 రెట్లెక్కువ. పట్టభద్రుల నిరుద్యోగం 11% పైనే ఉండగా, దేశంలో ఏటా కోటి మంది ఉద్యోగార్థులు పుట్టుకొస్తున్నారు.
పేపర్ లీక్, పరీక్షల ఆలస్యం, అధిక రిజర్వేషన్ కోటాలతో దారులు మూసుకుపోతున్నాయి. అన్ని ఐటీ సంస్థలు ఫ్రెషర్ల నియామాకాలు తగ్గించగా, 2022-25 మధ్య ఎంట్రీ-లెవెల్ రిక్రూట్మెంట్లు 80% తగ్గాయి. కాలేజీల నుంచి పనికిరాని డిగ్రీలతో వస్తూ, ప్రతి ఇద్దరిలో ఒకరు అర్హతకు తగిన ఉద్యోగమేంటో తెలుసుకోలేకపోతున్నారు. డిగ్రీలున్న యువత ఫుడ్ డెలివరీ వంటి పనులు చేస్తోంది. ఇది కొనసాగినంతకాలం ఆర్థికంగా కుటుంబాలపైనే ఆధారపడి తల్లిదండ్రులకు భారమవుతారు.
ఇదే.. వారి గౌరవం, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తుంది. 1.19 లక్షల స్కూళ్లల్లో విద్యుత్తు లేకపోగా, 98,600 బడుల్లో మరుగుదొడ్లు లేవు. లక్షకు పైగా స్కూళ్లు ఒక్క టీచర్ తోనే నడుస్తున్నాయి. విద్యకు జీడీపీలో 6% కంటే తక్కువగా ఖర్చు చేస్తున్నారని, వీటిని పరిష్కరిస్తే ‘జెన్ జీ’తో సమస్యే లేదంటున్నారు.