
చీరకట్టు.. కాళ్లకుండాల్సిన చెప్పులు చేతుల్లో.. ఒకవైపు ట్రాక్ సూట్లు, స్పోర్ట్స్ షూతో బరిలోకి దిగిన యువత.. కానీ కుమార్తె చదువు కోసం ఆమె ఎంచుకున్న సంకల్పం వృథా కాలేదు. కూతుర్ని చదివించడానికి మారథాన్ పోటీల్లో దిగిన మహారాష్ట్ర బీడ్ జిల్లాకు చెందిన రమాబాయి రన్వీర్ అందర్నీ ఓడించి రూ.3 వేలతోపాటు కప్పును అందుకుంది.
అంబాజోగైకి చెందిన విద్యాసంస్థల 75వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని అమృత్ దౌడ్ పేరిట మారథాన్ నిర్వహించారు. ట్రాక్ పై బురద, ఎగుడుదిగుళ్ల వల్ల కాళ్లకున్న చెప్పులు జారడంతో వాటిని చేతుల్లో పట్టుకునే పరుగు తీసింది. చీరకట్టుతోనే పరుగెత్తిన రమాబాయి.. యువకులు, క్రీడాకారుల్ని ఓడించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
రమాబాయి భర్త రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఇద్దరు కూతుళ్ల బాధ్యత ఆమెపై పడింది. పెద్దమ్మాయిని ఒక అకాడెమీలో చేర్పించి చదివిపిస్తుండగా, పుస్తకాలు కొనేందుకు డబ్బుల్లేకపోవడంతో మారథాన్ లో పాల్గొనాలని భావించింది. తాను పరుగెడుతున్నప్పుడు పిల్లల భవిష్యత్తు మాత్రమే కనిపించిందని చెమర్చిన కళ్లతో చెప్పడం అందరి గుండెల్ని బరువెక్కించింది. రమాబాయి చిన్న కూతురు సైతం మారథాన్ లో పాల్గొని రెండో స్థానంలో నిలిచింది.