
నేపాల్(Nepal)లో ఎప్పుడూ విపత్తు వచ్చినా ‘సతి లే సరాపేకో దేశ్(సతి శాపానికి గురైన దేశం)’ అన్న పదమే వినిపిస్తుంది. రాజకీయ సంక్షోభాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు 400 ఏళ్ల క్రితం నాటి చారిత్రక గాథను ప్రస్తావిస్తారు. 17వ శతాబ్దిలో ఖాట్మాండు(కాంతిపుర)ను మల్లా వంశానికి చెందిన రాజు లక్ష్మీనరసింహ పాలించేవాడు. అతని ప్రధానమంత్రి భీమ్ మల్లా అపార నమ్మకస్తుడిగా ఉండేవాడు. టిబెట్ తో వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకుని ఎన్నో లాభదాయక విజయాలతో దేశానికి తిరిగివచ్చాడు. ఆయన ఎదుగుదలను ఓర్వలేని కొందరు మంత్రులు, ఆస్థాన విద్వాంసులు రాజుకు చాడీలు చెప్పారు.
ఆ రాజు నిజానిజాలు విచారించకుండానే తీవ్ర ఆగ్రహంతో భీమ్ కు మరణశిక్ష వేశాడు. దీన్ని తట్టుకోలేని భీమ్ భార్య భువన్ లక్ష్మీ ఎంత మొత్తుకున్నా రాజ్యంలో ఎవరూ వినలేదు. చివరకు సతీసహగమనంలో భాగంగా ఆమె భర్త చితిపైకి ఎక్కి తీవ్రమైన ఆవేదన, కన్నీళ్లతో దేశాన్ని శపించిందట. “ఈ దేశంలో ఎన్నటికీ న్యాయం జరగదు.. నిజాయతీ గల వారికి గుర్తింపు దక్కదు.. పాలకులకు ప్రశాంతత ఉండదు..” అని శపిస్తూ ప్రాణత్యాగం చేసిందట.
కానీ ఆ తర్వాత రాజుకు అసలు నిజం తెలిసి ఒక నమ్మకస్తుడైన భక్తుణ్ని కోల్పోయానంటూ కుంగుబాటుకు గురై మానసక ప్రశాంతత కోల్పోయాడు. దీంతో రాజు కుమారుడు ప్రతాప్ మల్ల తన తండ్రిని జైల్లో పెట్టి రాజ్యాన్ని ఏలాడట. 1920లో అప్పటి ప్రధాని చంద్ర షమ్ శేర్ రాణా ఈ సతీసహగమన చట్టాన్ని రద్దు చేశాడు. కానీ ఎప్పుడు విపత్తు వచ్చినా నేపాల్ లో ఈ పురాణ గాథ తెరపైకి వస్తుంటుంది.