
యూఏఈలోని భారతీయులు, తమ దేశానికి వచ్చేవారికి అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వీసాల విషయాల్లో సాయం చేస్తామని వచ్చే అనధికార ఏజెంట్లు, మధ్యవర్తులకు బయోమెట్రిక్ వివరాలు ఇవ్వొద్దని స్పష్టం చేసింది. వీసా రెగ్యులరైజ్, ఎమర్జెన్సీ సర్టిఫికెట్స్, ఎగ్జిట్ పర్మిట్స్, ఎమిరేట్స్ ఐడీల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించింది. యూఏఈ(United Arab Emirates)లో బయటపడ్డ స్కాముల్లో ఉద్యోగులు బాధితులవుతున్నట్లు గుర్తించామని అక్కడి ఎంబసీ ప్రకటించింది.
మోసపూరితంగా బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తున్న నిందితులు వాటి ద్వారా అక్రమాలకు పాల్పడుతున్నారని, బాధితులకు తెలియకుండానే బ్యాంక్ అకౌంట్లు తెరిచి రుణాలు(Loans), క్రెడిట్ కార్డులు తీసుకుంటున్నారని హెచ్చరించింది. యూఏఈ ప్రభుత్వ సెంటర్లను మాత్రమే సంప్రదించాలని చెప్పింది. భారతీయ పాస్ పోర్టులు, ఎమర్జెన్సీ సర్టిఫికెట్ల కోసం భారత కాన్సులేట్లను మాత్రమే సంప్రదించాలని స్పష్టం చేసింది.