గ్రూప్స్ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని దారుణానికి పాల్పడింది. హైదరాబాద్ అశోక్ నగర్ లో ఉంటూ ఎగ్జామ్స్ కు ప్రిపేరవుతున్న ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య(Suicide)కు పాల్పడింది. హాస్టల్ లో నిన్న రాత్రి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. గ్రూప్స్ పరీక్షలు వాయిదా పడటంతోనే ఈ అఘాయిత్యానికి పాల్పడిందని మిగతా అభ్యర్థులు అంటున్నారు. వరంగల్ జిల్లా బిక్కాజిపల్లికి చెందిన ప్రవళిక కొంతకాలంగా హాస్టల్ లో ఉంటూ ప్రిపేర్ అవుతోంది. జరిగిన ఘటనపై మిగతా అభ్యర్థులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. నినాదాలు చేస్తూ భారీ సంఖ్యలో అక్కడకు చేరుకున్నారు. పోలీసులు సముదాయించినా వినకపోవడంతో చివరకు లాఠీఛార్జ్ చేసి అందర్నీ చెదరగొట్టారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన అభ్యర్థులంతా పోలీసులపైకి రాళ్లు విసిరారు. ఈ రాళ్ల దాడిలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.
పలు పార్టీల మద్దతు
అభ్యర్థులు చేపట్టిన ఆందోళనకు వివిధ పార్టీల నేతలు సంఘీభావం ప్రకటించారు. BJP, కాంగ్రెస్ సహా పలు పార్టీల లీడర్లు ఈ ఆందోళనలో పాల్గొని ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. BJP ఎంపీ లక్ష్మణ్, కాంగ్రెస్ నేత అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ విజయారెడ్డి తదితరులు అభ్యర్థులకు మద్దతు తెలిపారు. వీరందర్నీ పోలీసులు అరెస్టు చేశారు.