
నేపాల్ జల ప్రళయంలో మృతుల సంఖ్య 781 మందికి చేరినట్లు అక్కడి ప్రభుత్వం ప్రకటించింది. మరో 3,000 మంది ఆచూకీ లేకుండా పోయిందని, వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది. కేవలం జల విద్యుత్తు ప్రాజెక్టుల సొరంగాల్లోనే చిక్కుకుని 600 మందికి పైగా గల్లంతయ్యారు. మరోవైపు బాధితుల్ని ఆదుకునేందుకు భారత్ నాలుగో విమానాన్ని నేపాల్ పంపించింది. ఏ దేశ బలగాల సాయం అక్కర్లేదని మొన్ననే ఆ దేశం ప్రకటించడంతో చాలా దేశాలు వస్తువుల్నే పంపిస్తున్నాయి.
నేపాల్ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఆశ్చర్యకరమైన కారణం ఉందంటున్నారు. గతంలో భూకంపం సంభవించిన సమయంలో విదేశీ బలగాలు రావడంతో స్థానిక పోలీసులతో కమ్యూనికేషన్ దెబ్బతిని సహాయక చర్యలకు ఆటంకం కలిగిందని తెలిపింది. అందుకే ఈసారి ఇతర దేశాల సైనికుల సేవలు అవసరం లేదని కరాఖండీగా చెప్పేసి సొంత బలగాల్నే రంగంలోకి దింపింది.