
పర్వతాలు, భారీ శిఖరాలతో ‘ల్యాండ్ లాక్డ్’ దేశంగా నేపాల్ దర్శనమిస్తుంది. హిమాలయాలు, భారత సరిహద్దు మైదానాల మధ్య ఇరుకుగా ఉండగా, ప్రపంచంలోని 10 ఎత్తైన శిఖరాల్లో 8 అక్కడే ఉన్నాయి. నిరంతరం మంచుతో కూడిన భూభాగం నిటారుగా ఉండటంతో నీరు, రాళ్లు వేగంగా కిందికి వస్తాయి. ఆ దేశంలో పెద్దసంఖ్యలో నదులు, వాగులు ప్రవహిస్తుండగా, జూన్-సెప్టెంబరు మధ్య విపత్తులు వస్తుంటాయి. ఇండియన్-యూరోపియన్ ప్లేటు ఢీకొనడం వల్ల నేపాల్లో భూకంపాలు వస్తుంటాయి.
కొండచరియల ప్రాంతంలో రోడ్ల నిర్మాణాలు, నదుల పక్కన యథేచ్ఛగా ఆక్రమణలు, జలవిద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించడంతో పర్యావరణం దెబ్బతిని హిమానీనదాలు(గ్లేసియర్స్) కరుగుతున్నాయి. కొండల్ని తొలిచి విద్యుత్తు ప్రాజెక్టులు నిర్మించడం పెద్ద శాపంగా మారింది. నేపాలే కాదు, భారత్ వైపూ విపత్తులు వస్తున్నాయి. ఛార్ ధామ్, వైష్ణోదేవి ఆలయాలకు వెళ్లే వ్యక్తులు కూడా పర్యావరణాన్ని పాడు చేస్తున్నారు. అందుకే అమర్ నాథ్ లోని మంచు శివలింగం ఈసారి గడువు కన్నా ముందుగానే కరిగిపోయింది.