
కొద్దికాలం క్రితం నేపాల్ లో ఊహించని మార్పు ఏర్పడింది. భారత్ కు చెక్ పెట్టేందుకు భారీగా పెట్టుబడులు పెట్టాలన్న చైనా కుయుక్తులకు తలొగ్గి విర్రవీగింది. మన దేశంలో ఒక జిల్లా అంత కూడా లేని ఆ హిమాలయ దేశం ఎగిరెగిరి పడినా భారత్ తొందరపడలేదు. అలాంటి దేశంలో ఉత్పాతం ఎదురైతే చైనా కనీసం పరామర్శించకపోగా.. భారత్ మాత్రం 3 విమానాల్లో సహాయసామగ్రి పంపించింది.
భారత్-నేపాల్ మధ్య 1,751 కి.మీ. సరిహద్దు అంశం ఆ దేశాన్ని ఉసిగొల్పింది. భారత్-చైనా-నేపాల్ సరిహద్దుల్లోని కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలు భారత్ ఆధిపత్యంలో ఉండగా, నేపాల్ కు కూడా వాటిపై సార్వభౌమాధికారం ఉంది. కైలాస మానస సరోవర్ యాత్ర లిపులేఖ్ గుండానే సాగుతుంది. 1816 నాటి సుగౌలీ ఒప్పందం ప్రకారం మహాకాళి నది తమది అని నేపాల్ అంటుండగా, అది ఉత్తరాఖండ్ లో భాగమంటోంది భారత్.
వివాదాస్పద ప్రాంతాల్ని కలుపుతూ నేపాల్ 2020లో కొత్త మ్యాప్ తెచ్చి, దాన్ని రూ.100 నోటుపై ముద్రించాలని చూసింది. 1950 నాటి భారత్-నేపాల్ శాంతి ఒప్పందం పాతబడ్డదంటూ అక్కడి పార్టీలు వ్యతిరేక ప్రచారంతో జనాల్ని రెచ్చగొట్టాయి. 2015లో కొత్త రాజ్యాంగం తెచ్చినపుడు మధేసీల ఆందోళనలతో భారత్ నుంచి రవాణా ఆగిపోతే, ఇండియా కావాలనే చేసిందంటూ నేపాలీలు గుర్రుగా ఉన్నారు. భారత సైన్యంలో గూర్ఖాల నియామకాలు అగ్నిపథ్ వల్ల నిలిచిపోవడం కూడా నేపాలీల మంటకు కారణమైంది. ఇంత జరిగినా భారత్ మాత్రం ఎక్కడా తొందరపడలేదు. అదే మన గొప్పదనం.