
ఈ పోటీ ప్రపంచంలో ఉరుకుల పరుగుల జీవితం కన్నా ప్రశాంతతే ముఖ్యమని జెన్ జీ యువత నిర్ణయానికి వచ్చింది. ఉన్నతోద్యోగాలు, పెద్ద హోదాల కంటే వర్క్, లైఫ్ మధ్య బ్యాలెన్స్ ముఖ్యమని గ్లోబల్ ఎడ్యుకేషన్ సంస్థ ‘ఎమెరిటస్’ నిర్వహించిన సర్వేలో బయటపడింది. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగాలు కోల్పోవడం వంటి కారణాలతో పూర్తి మార్పు కనపడుతోందని తేలింది. ఇపుడున్న వాతావరణంలో ఎగ్జిక్యూటివ్ స్థాయికి చేరుకోవడాన్ని ఎవరూ కోరుకోవట్లేదు.
దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 15-28 సంవత్సరాల యువత నుంచి అభిప్రాయాలు సేకరించింది. ప్రీ-కాలేజ్, ఉన్నత విద్యకు వెళ్తున్న దశ, ఉద్యోగ జీవితం ప్రారంభం.. ఇలా మూడు అంశాలపై సర్వే జరిగింది. కంపెనీల లేఆఫ్స్, వీసా దొరకని గందరగోళ పరిస్థితులు చూసి సంప్రదాయ కెరీర్ విధానం ఏ మాత్రం సురక్షితం కాదని భావిస్తున్నారు. మారుతున్న ఆర్థిక పరిస్థితులు, వీసా నిబంధనలు కఠినం కావడం, చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు దొరక్కపోవడాన్ని గమనిస్తున్న యువతీయువకులు విదేశీ విద్యపై మోజు తగ్గించారు.
విదేశాలకు వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి గతేడాదితో పోలిస్తే 48% మందిలో తగ్గిందని సర్వే తెలిపింది. విదేశీ విద్యకు బదులుగా భారతదేశంలో చదువుకోవడమే ఉత్తమమన్న భావనకు వచ్చారు. విద్యాసంస్థలు అందించే వేగం కంటే వారి నైపుణ్యాలే స్పీడ్ అందుకున్నాయని ఆ సంస్థ ప్రకటించింది.