
పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు ప్రకటించారు. రాబోయే నెలల్లో వాతావరణ సరళి తీవ్రంగా ప్రభావితమై 2026 చివరి వరకు ఎల్ నినో మరింత బలపడుతుందన్నారు. 1950లో ఆధునిక పరిశీలనలు ప్రారంభమైన తర్వాత ఏర్పడ్డ అత్యంత బలమైన ఎల్ నినోలలో ఇది ఒకటిగా నిలుస్తుందని అంచనా వేశారు. ఒకవైపు భారీ వర్షపాతాలు, తుపానులు.. మరోవైపు కరవులు, వడగాలులుంటాయి. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో కరవు తాండవిస్తుంటే.. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, కశ్మీర్లో కుంభవృష్టి కురిసింది.
ఇక నుంచి వాతావరణం నిర్దిష్టంగా ఇలా ఉంటుందని చెప్పే పరిస్థితి కూడా అంచనాకు అందదని సైంటిస్టులు హెచ్చరించారు. రుతుపవనాల్నే దెబ్బకొట్టిన ఎల్ నినో.. మానవ కార్యకలాపాల వల్ల వెలువడే ఉద్గారాల వేడి(గ్లోబల్ వార్మింగ్)ని సముద్రాలు గ్రహించడంతోనే ఏర్పడింది. మంచు కరగడం వల్ల సముద్ర మట్టాలు పెరిగి తీర ప్రాంతాలు మునిగిపోయే ప్రమాదముంది.